Sunday, 6 December 2015

Tollywood Stars for chennai floods

‘మన మద్రాస్‌ కోసం’ మేముంటాం - టాలీవుడ్‌ స్టార్స్‌


‘‘టాలీవుడ్‌లో చాలామంది నటీనటులు చెన్నై వరద బాధితుల సహాయార్థం వ్యక్తిగతంగా తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలిచ్చారు. అవి ప్రజలకు చేరడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి ఆలోపు ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అత్యవసర వస్తువులను అందజేసేందుకు మళ్లీ మేమంతా ముందుకొచ్చాం. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకున్నప్పుడే మనిషిలోని మానవత్వం బయటపడుతుంది. చెన్నై ప్రజలకు అండగా మేముంటాం’’ అన్నారు సినీ హీరో అల్లు అర్జున్. ‘మన మద్రాస్‌ కోసం’ పేరిట ఏర్పాటు చేసిన క్యాంపెయిన్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టాలీవుడ్‌ యువతారలు పాల్గొన్నారు. మద్రాస్‌ ప్రజలకు అండగా మేమున్నాం అని భరోసా ఇచ్చారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘మేమంతా చెన్నైలో పుట్టి పెరిగాం. ఈరోజున అక్కడ పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది. అక్కడి ప్రజలకు మందులు, దుప్పట్లు అవసరముందని తెలుసుకుని ‘మన మద్రాస్‌ కోసం’ తరఫున వాటితో పాటు ఆహారం, నీళ్లు సేకరిస్తున్నాం. కనీవినీ ఎరుగని వరదలతో రహదారులు పాడైపోయాయి కాబట్టి మేం పంపించే నిత్యవసర వస్తువులన్నీ రహదారికి చేరువలో ఉన్న ప్రజలకు అందజేస్తాం’’ అని తెలిపారు.
‘‘నలుగురు ఉన్న కుటుంబానికి పది రోజులకు సరిపడా ఆహార పదార్ధాలను ఒకే ప్యాకెట్‌ రూపంలో చేసి అందజేస్తున్నాం. అక్కడ మా తరఫున విశాల్‌, కార్తీ, సిద్ధార్థ్‌, చిన్మయి వాలంటీర్స్‌గా సహాయమందిస్తున్నారు’’ అని మంచు లక్ష్మి తెలిపారు.
రానా మాట్లాడుతూ ‘‘మా పిలుపు అందుకుని చాలామంది వారికి తోచిన సహాయాన్ని వస్తు రూపంలో అందిస్తున్నారు. ఇప్పటికి ఒక కంటైనర్‌ని చెన్నైకి పంపాం. ఇంకో ట్రక్‌ సోమవారం బయలుదేరడానికి సిద్ధమవుతోంది’’ అని చెప్పారు. వరద బాధితులకు శానిటేషన్ అనేది చాలా అవసరం. అందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా మాకు తెలిసిన డాక్టర్ల సలహాతో మందుల్ని కూడా పంపిస్తున్నాం’’ అన్నారు నాని.
ఈ సమావేశంలో అల్లరి నరేశ్, మంచు మనోజ్‌, నవదీప్‌, సుశాంత్, మధుశాలిని, తేజస్వి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment